Monday, April 30, 2007

Can Vishnu make it?

మళ్ళీ సోమవారం! రెప్పపాటులో వీకెండ్ అయ్యేపోయె. వచ్చే శనివారం 'చిన్మయ 'లో భగవద్గీత కాంపెటీషన్ ఉంది. విష్ణుని ఎప్పుడోనే రిజిస్టరు చేసా. వాడి వయసుకి ధ్యానయోగం లో 17 శ్లోకాలు పాడాలి. లాగీ, లాగీ 15 నేర్పించాను. ఇవాళ, రెపుట్లో మిగిలిన రెండూ నేర్పించేస్తే, మిగిలిన మూడు రోజులూ ప్రక్టీసుకుంటాయని. మరీ ఎక్కువ మంది పిల్లలు రిజిస్టరవ్వలేదు, వీడి గొంతా, కంచు! ఉచ్చారణ చాలా బావుంది. ఫర్లేదు, కప్పు వీడిదే. ఎవాళ ప్రొద్దుటి దాకా ధీమాగానే ఉన్నను - ప్రొద్దూ-ప్రొద్దున్నే నాతో పని చేసే ఒకతను, సుబ్బయ్య అనుకుందాం, వచ్చి పెద్ద బాంబే పెట్టెళ్ళాడు. వాళ్ళబ్బాయి, విష్ణు కంటే ఏణ్ణర్ధం చిన్నాడు, 17 శ్లోకాలూ వప్పచెప్పేస్తున్నాడంట! అదీ, రెండు వారాల క్రితమేనంట! ముందు 'How nice! 'అనుకున్నా...వెంటనే, వామ్మో, మరి నా కప్పో? దాన్నసలే మాంటిల్ మీద పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపించి, "విష్ణు కి భగవద్గీత లో వచ్చింద"ని అడిగినా అడగకపోయినా చెప్పేసుకుందామనుకున్నానే! పోయిన్నెల ఉగాది ప్రోగ్రాంస్ లో విష్ణు మన తెలుగు సంవత్సరాలు అరవయ్యీ వప్పచెప్పి నప్పుడు, అందరూ "ఆహా ఎంత బాగా చెప్పాడు మీ అబ్బాయి" అన్నప్పుడు, రమణకి నాకు బ్లాక్ మౌంటెన్ ఎక్కిన ఫీలింగొచ్చేసింది. అన్నిటికన్న ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న అకాంప్లిష్మెంట్లు వాడి కాంఫిడెన్స్ పెంచుతున్నాయి. మరిప్పుడా కప్పుని సుబ్బయాళ్ళ బుడ్డాడు కొట్టేస్తే ఏం చెయ్యాలబ్బా!! ఆ కప్పుని చూసి, దాని కోసం మేము చేసే హడావుడి చూసి, ధాత్రి కూడా వచ్చే ఏడు మనవి అవీ ఇవీ కొంచెం నేర్చుకుంటుందని ఆశ పడ్డానే!

Friday, April 27, 2007

Dissection

అవునూ, About Me పూరిస్తూంటే గుర్తొచ్చింది - ఫ్రెండ్సు ఫోను చేసి, ఏమే ఎంకమ్మా అంటారు, పతిదేవులుంగారూ అలాగే దీవిస్తారు, పిల్లలూ, ముఖ్యంగా చిన్నది ధాత్రి, "Silly amma, you don't know anything!" అంటుంది. నా పేరు ఎంకమ్మ అని అనుకునేరు. మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు సలక్షణంగా ఉంది. కాని ఒక రకంగా ఎంకమ్మనౌతాన్లెండి. ఎంకయ్యని(వెంకట రమణని) చేసుకున్న తరువాత ఎంకమ్మనేగా!