Friday, May 18, 2007

సుభాషిణి

మన సుభాషిణి ఉరఫ్ సుభ ఉరఫ్ సుబ్బు చివరికి మనకి ఫోటోలు పంపించింది. ఇది రెండేళ్ళ క్రితం Ohioలో - సుభషిణి, కార్తిక్, వాళ్ళ పిల్లలు, అజయ్, అదితి. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నారు కదా, undergrad friends మనమెవరమైనా అటు వెళ్తే, తప్పకుండా రమ్మంటోంది.



అజయ్, అదితి


సుభా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మేనకోడలు - మనమందరం సుభా వాళ్ళ మామయ్య పెళ్ళైన కొత్తలో, మెహదీపట్నంలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాం, గుర్తుందా? వాళ్ళమ్మాయి!

Thursday, May 17, 2007

ఇక్కడి పిల్లలు - తెలుగు

మన పిల్లలు ఎక్కువ మంది, ఇంట్లో గడిపే టైం కన్నా బయట గడిపేది ఎక్కువైపోవటం వల్ల, తెలుగు కన్నా ఇంగ్లీషు మాట్లాడటం ఎక్కువ కదా. కానీ పర్లేదు, మనం టైము, వీలూ చేసుకుంటే, కనీసం చిన్న-చిన్న సంభాషణల వరకైనా నేర్పించుకోవచ్చు. ఈ మధ్య మా ఇంట్లో పిల్లలిద్దరూ ఎంతో కొంత తెలుగులో ప్రయత్నిస్తున్నారు. ఇవిగో నమూనాలు -

అమ్మా, more నెయ్యి కావాలి.
నాన్నెక్కడున్నాడు?
నాన్న is స్నానమింగ్.
చెల్లి పిల్ల ఈజ్ కోతి పిల్ల. She does all కోతి వేషాలు.
ఆ ఆంటీ కి spoon కావాలి.
ముద్ద పప్పు - ఆవకాయి కావాలి.
కారం, మంట. మంచి నీళ్ళు కావాలి!!!!

ఇదుగో, నవ్వుకో దగ్గ సాంపిల్ - ఈ మధ్యో సారి తెలిసిన వాళ్ళబ్బాయి (విష్ణు తోటి వాడు) కలిసినప్పుడు, మొహం పీక్కు పోయినట్టుంటే, "ఏం కృష్ణా, ఒంట్లో బాలేదా?" అని అడిగా. "ఏం లేదాంటీ, ఇప్పుడే డోక్కునొచ్చా". నేను నవ్వాపుకోవటం కష్టమైపోయింది. సంగతేంటంటే, ఊళ్ళో stomach fluలున్నాయి. తనకూడా మొదలైనట్టుంది, పాపం.

Monday, May 14, 2007

తెలుగుకొచ్చిన తిప్పలు

మా అమ్మా-నాన్నలు చదువుకునే రోజుల్లొ ఇంగ్లీషు చదువులు తక్కువ. ఇంగ్లీషు వాడుక వాళ్ళు ఉద్యోగాలు చేయటం మొదలయ్యిన తరువాత క్రమంగా పెరిగిపోయింది. అప్పట్లో తెలుగులో ఇంగ్లీషు దొర్లేది. పోయినేడు ఇండియకెళ్ళినప్పుడు బయట యువత "తెలుగులో" మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు ఇంగ్లీషులో తెలుగు దొర్లుతోందా అని అనుమానం వస్తోంది. పిల్లల దాకా ఎందుకు, అప్పుడప్పుడు కలిసే మా తెలుగు మితృలతో నా సంభాషణలు ఇలా ఉంటాయి-

నేను: బావున్నారా?
టెల్గూస్: Doing good..doing good! How are you doing?
నేను: మేమూ బానే ఉన్నాం. చాలా రోజులయ్యింది కనిపించి?
టెల్గూస్: Yeah... been quite busy at work, lately. How is your work?
నేను: ఫర్వాలేదు, highs and lows. పిల్లలు బావున్నారా?
టెల్గూస్: They have a crazy life too.

రామ చంద్రా...ఏమిటీ దుర్గతి! ఎప్పుడైనా చైనీసు వాళ్ళని గమనించారో లేదో, కలిస్తే చాలు, చింగ్-చుంగ్-చాంగ్ మంటూ మాట్లాడేసుకుంటారు. మనకే ఎందుకీ దుస్థితి?

ఇంకో క్లాసిక్, తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ ఇంటికి ఫోను చేసి వాయిస్ మైల్ కి వెళ్తే, పెట్టే మెసేజీలు -
Hi! This is Pulla Rao calling from Boston. Been a long time since we spoke. Will try calling again later. By the way, Wish you a Happy Telugu new year, I mean, Happy Ugadi!

అదే మన జ్యోతి కనుక చేస్తే ఇలా ఉంటుంది -
ఏమే ఎంకమ్మా! మళ్ళీ ఏమైపోయావ్? ఎప్పుడూ ఫోను తియ్యవేమే? ... వగైరా, వగైరా, వగైరా

అదే శ్రీహరి చేస్తే, పలుకే బంగారమాయెరా స్టయిలు - అక్కా, ఓసారి ఫోన్ చెయ్యి. ఉంటాను!

ఇక పూర్తిగా ఆడవాళ్ళ డిపార్ట్మెంటు కొస్తే, ఇలా ఉంటున్నాయి సంభాషణలు -
పార్టీ మెన్యూ తేల్చారాండి?
ఆ...veggie pakodas, పకోడీలు?
okra chutney, బెండకాయ పచ్చడి?
broad beans fry, చిక్కుడుకాయ వేపుడు?
potato kurma, ఆలుగడ్డ/బంగాళాదుంప కుర్మా
spinach pappu, హతోస్మి! పాలకూర పప్పు
chicken rice, పలావు/బిరియానీ కి ఫ్యాన్సీ పేరు "రైస్" అయ్యిందా?
సాంబారు,
curd rice పెరుగన్నమేగా?

అందుకే కాబోలు, మా ఇంటికి వచ్చిన ఓ అబ్బాయిని, "పాల కూర పప్పేయనా?" అని అరడజను సార్లు అడిగినా అర్థం కాలేదు పాపం.

Thursday, May 10, 2007

చీర సంగతి

అవునూ, ధాత్రికి చీరేంటంటారా? మా అమ్మ సరదా లెండి. పెద్ద పిల్లలా అనిపించింది కదా?! అమ్మ కూడా ఇంకేప్పుడూ ఒద్దు లెమ్మా అంది. అవును మరి, ఆ చీరల్లేకుండానే ఈవిడొక ఆరిందా అమ్మలక్క.

అవీ ~ ఇవీ

విష్ణు కప్పు గురించి ఇంకా ఏమీ తెలియ లేదండోయ్. Annual day రోజు (ఇంకో నెల్నాళ్ళుంది) చెబుతారంట. ఈ లోపల వీడు మనవాళ్ళెవరన్న కనిపించినడం తప్పు, "Would you like to hear my Bhagavadgeeta?" అని అడిగి మరీ వేసేస్తున్నాడు.

మళ్ళీ రేపు వచ్చే ఆదివారం Mother's day కదా, missionలో మాతృపూజ చేస్తారంట. యెబ్బే! కాళ్ళు కడిగించుకోవాలంట. చెప్తా ఏమవుతుందో.

ఇదుగో పెద్ద న్యూసు - నా ఉద్యోగానికి నూకలు చెల్లి పోయాయోచ్! ఈ కంపెనీ లో ఏడేళ్ళనుండి మారకుండా చేస్తున్నాను. ఇంకా సాంతం పంపించెయ్య లేదు, ఇంకొన్ని వారాల మాటన్నట్టు చెప్పాడు మా పెద్దాయన. చివరదాకా ఉండి చూస్తా. ఇప్పుడే హడావుడిగా జండా పీక్కుని పరిగెట్టే ఆలోచనలు నాకస్స్స్స్సల్లేవ్. ఆ తరువాత ఈ ఉద్యోగాల కన్నా ఏదైనా వ్యాపారంలో చెయ్యి పెడితేనో? కాలు కూడా పెట్టటానికి రెడీయే నేను. అందరూ, ఏమైనా ఇడియాలుంటే తొందరగా చెప్పండి.

Tuesday, May 1, 2007

ధాత్రి కి ఐదు నిండాయి

పోయిన 19న, ధాత్రి కి 5 నిండాయి. వచ్చే సెప్టెంబరు నుండి స్కూలుకి కూడా వెళ్తుంది. ఇప్పుడూ వెళ్తోందనుకో, కాని, అప్పుడు అసలు స్కూలు కదా. హమ్మయ్య! నెల నెలా ఓ పెద్ద బిల్లు తగ్గుతుంది. కానీ దానికి సరిపడా టెండర్లు న బుర్రలో ఆల్రెడీ ఉన్నయి. వాళ్ళని స్కూలు తర్వాత కేర్ లో వీలైనంత తక్కువ ఉంచి, ఒక గేం లోనూ, ఒక ఇన్స్ట్రుమెంట్ లోనూ ఎప్పుడూ ఉంచాలి. అనుకుంటూనే ఉన్నా... అంతలోనే పోయిన వారం మళ్ళీ మా ఆడ పడుచు (shall be referred to as పడుచు from here on) చెప్పనే చెప్పింది. కాలేజీ లకి తప్పకుండా అవి అవసరం పడతాయని. గబగబా బుర్రూపేశా. ఇప్పుడే గా కేజీ లో అడుగు పెట్టేది, అప్పుడే కాలేజీ అంటావేంటి అంటారా? మా విష్ణు గాడి తీరే వేరు. వాడు పైకి వచ్చే దాని గురించి దిగులుండదు. కానీ మా గుండమ్మ దారే వేరు - ఆ గోడు మళ్ళెప్పుడైనా వెళ్ళ పోసుకుంటా.

సరే, ఐదు నిండాయి కదా, ఇవిగో సంబరాలు ~

స్కూల్లో - క్లాసు పిల్లలందరి తోనూ
మళ్ళీ, ఓ చిన్న బుజ్జి pedicure party, ఒక ఐదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ తోనూ
మళ్ళీ, మన తెలుగు స్నేహితుల దీవెనలు కావాలి కదా, ముచ్చటగా మూడో రోజు.

Monday, April 30, 2007

Can Vishnu make it?

మళ్ళీ సోమవారం! రెప్పపాటులో వీకెండ్ అయ్యేపోయె. వచ్చే శనివారం 'చిన్మయ 'లో భగవద్గీత కాంపెటీషన్ ఉంది. విష్ణుని ఎప్పుడోనే రిజిస్టరు చేసా. వాడి వయసుకి ధ్యానయోగం లో 17 శ్లోకాలు పాడాలి. లాగీ, లాగీ 15 నేర్పించాను. ఇవాళ, రెపుట్లో మిగిలిన రెండూ నేర్పించేస్తే, మిగిలిన మూడు రోజులూ ప్రక్టీసుకుంటాయని. మరీ ఎక్కువ మంది పిల్లలు రిజిస్టరవ్వలేదు, వీడి గొంతా, కంచు! ఉచ్చారణ చాలా బావుంది. ఫర్లేదు, కప్పు వీడిదే. ఎవాళ ప్రొద్దుటి దాకా ధీమాగానే ఉన్నను - ప్రొద్దూ-ప్రొద్దున్నే నాతో పని చేసే ఒకతను, సుబ్బయ్య అనుకుందాం, వచ్చి పెద్ద బాంబే పెట్టెళ్ళాడు. వాళ్ళబ్బాయి, విష్ణు కంటే ఏణ్ణర్ధం చిన్నాడు, 17 శ్లోకాలూ వప్పచెప్పేస్తున్నాడంట! అదీ, రెండు వారాల క్రితమేనంట! ముందు 'How nice! 'అనుకున్నా...వెంటనే, వామ్మో, మరి నా కప్పో? దాన్నసలే మాంటిల్ మీద పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపించి, "విష్ణు కి భగవద్గీత లో వచ్చింద"ని అడిగినా అడగకపోయినా చెప్పేసుకుందామనుకున్నానే! పోయిన్నెల ఉగాది ప్రోగ్రాంస్ లో విష్ణు మన తెలుగు సంవత్సరాలు అరవయ్యీ వప్పచెప్పి నప్పుడు, అందరూ "ఆహా ఎంత బాగా చెప్పాడు మీ అబ్బాయి" అన్నప్పుడు, రమణకి నాకు బ్లాక్ మౌంటెన్ ఎక్కిన ఫీలింగొచ్చేసింది. అన్నిటికన్న ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న అకాంప్లిష్మెంట్లు వాడి కాంఫిడెన్స్ పెంచుతున్నాయి. మరిప్పుడా కప్పుని సుబ్బయాళ్ళ బుడ్డాడు కొట్టేస్తే ఏం చెయ్యాలబ్బా!! ఆ కప్పుని చూసి, దాని కోసం మేము చేసే హడావుడి చూసి, ధాత్రి కూడా వచ్చే ఏడు మనవి అవీ ఇవీ కొంచెం నేర్చుకుంటుందని ఆశ పడ్డానే!